ప్రముఖ నటి నయనతార సినీ, జీవిత చరిత్ర ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ‘నయనతార బియాండ్ ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసి ప్రసారం చేసింది. దానిలో ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా ‘నానుమ్ రౌడీ దాన్’లోని కేవలం మూడు సెకన్లు నిడివిగల ఓ చిన్న వీడియో క్లిప్ కూడా ఉంది.
ప్రముఖ కోలీవుడ్ నటుడు, ఆ సినిమా నిర్మాత ఆ వీడియో క్లిప్ వాడుకునేందుకు అనుమతి నిరాకరించినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ వాడుకుంది. దీనిపై ఆయన నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్, వారి సినీ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై మద్రాస్ హైకోర్టులో రూ.10 కోట్లకు దావా వేశారు. దానిని సవాలు చేస్తూ నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ వెయ్యగా న్యాయస్థానం కొట్టివేసింది. తద్వారా ఈ కేసులో తీర్పు ఏవిదంగా ఉండబోతోందో ఊహించుకోవచ్చు.
ధనుష్ అనుమతి ఇవ్వకపోయినా ఆ సినిమా నుంచి మూడు సెకన్ల నిడివిగల క్లిప్పింగ్ వాడుకున్నామని, ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందే వస్తుందని నయనతార స్వయంగా చెప్పారు. కనుక కాపీ రైట్ చట్టం ప్రకారమే మద్రాస్ హైకోర్టు తీర్పు ఉండవచ్చు. కానీ పది కోట్లకు బదులు జరిమానా కాస్త తగ్గించవచ్చు లేదా నయన్ దంపతులను మందలించి విడిచిపెట్టవచ్చు.