
బక్కపలుచగా ఉండే ధనుష్ కోలీవుడ్‌లో పెద్ద హీరోలలో ఒకరు. కనుక తమిళనాడులో అభిమానులు కూడా ఎక్కువే. కనుక పారితోషికం కూడా ఎక్కువే తీసుకుంటారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోలకు లభిస్తున్న పారితోషికాల గురించి తెలుసుకున్నప్పటి నుంచి తెలుగు సినిమాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నాగార్జునతో కలిసి నటిస్తున్నారు.
తమిళ సినిమాలకు రూ.25-30 కోట్లు తీసుకుంటున్న ధనుష్ కుబేరకి రూ.40 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే మరో తెలుగు నిర్మాత ఓ తెలుగు సినిమా కోసం ధనుష్‌ని కలవగా రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన్నట్లు తెలుస్తోంది. అందుకు ఆ నిర్మాత అంగీకరించడంతో ధనుష్ తంతే బూర్ల గంపలో పడిన్నట్లయింది.
కనుక ఇకపై ఏడాదికి కనీసం ఒకటి రెండు తెలుగు సినిమాలు చేయాలని ధనుష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంటే టాలీవుడ్ నుంచి వంద కోట్లు పట్టుకుపోతారన్న మాట! తెలుగులో ఒకటి రెండు సరైన హిట్స్ పడితే చాలు రేటు ఇంకా పెంచేయొచ్చు కూడా.
తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లే ఉన్నారు. ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ నుంచి హీరోలు కూడా వస్తున్నారు.
మన పెద్ద హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులు అందరూ ఇప్పుడు ఒక్కో సినిమాకి రెండు మూడేళ్ళు లాక్ అయిపోతున్నారు కనుక తెలుగు సినీ పరిశ్రమలో సెటిల్ అవడానికి ఇతర రాష్ట్రాల హీరోలకు ఇదే మంచి సమయం.. అవకాశం.