
ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయంలో నాలుగు రోజులుగా సాగిన ఐటి సోదాలు ముగిశాయి. ఆయన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి దీని గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఐటి సోదాలు నా ఒక్క ఇంట్లోనే జరిగి ఉంటే ఏదో జరిగే ఉంటుందని మీరందరూ ఊహించుకున్నా అర్దం ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో ఇంకా చాలా మందిపై దాడులు జరిగాయి. కానీ మీఅందరికీ ఏదో హైలైట్ వార్తలు కావాలి కనుక ఏదేదో ఊహించేసుకొని వ్రాసేస్తున్నారు. కానీ మీరు ఊహించుకున్నట్లు ఏమీ జరగలేదు.
గేమ్ చేంజర్ భారీ భారీ బడ్జెట్‌తో తీశాము కనుక దానిలో ఎవరెవరికి ఎంతెంత పేమెంట్స్ చేశామనే రికార్డ్స్ అడిగి తీసుకున్నారు. మేము ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో ఐటి రిటర్న్స్ దాఖలు చేస్తూనే ఉంటాము.
కానీ మా నుంచి డబ్బు తీసుకొని సేవలు అందించిన అవతలివారు కూడా ఐటి రిటర్న్స్ సమర్పించాలి కదా? ఆ లెక్కలు మా నుంచి అడిగి తీసుకున్నారు.
నేను ఈ వ్యవహారం నుంచి బయటకు వచ్చేశాను. కనుక ‘దిల్‌రాజుపై ఐటి దాడులు’ అనే స్టోరీలో నుంచి మీరు కూడా బయటకు వచ్చేయాలని కోరుతున్నాను,” అని నవ్వుతూ చెప్పారు.
దిల్‌రాజు ఇంట్లో నాలుగు రోజులుగా ఐటి అధికారులు సోదాలు చేసి రికార్డులు పరిశీలించిన తర్వాత కూడా ఆయన ప్రెస్‌మీట్ పెట్టి ఇంత కూల్‌గా నవ్వుతూ మాట్లాడుతుండటం చూస్తే, ఆయనకు ఎటువంటి చిక్కులలో చిక్కుకోలేదనే అనిపిస్తుంది.