నటుడు విజయ రంగరాజు మృతి

పలు తెలుగు సినిమాలలో నటించిన నటుడు విజయ రంగరాజు (69) సోమవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడటంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ సోమవారం ఆయన పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. 

విజయ రంగరాజు మహారాష్ట్రలో పుట్టి పెరిగారు. ఆయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్‌. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తర్వాత విజయ రంగరాజుగా పేరు మార్చుకున్నారు. సినీ పరిశ్రమలో ప్రవేశించాక మునుపు తమిళనాడులో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నారు. 

ఆయన తొలిసారిగా 1994 లో భైరవద్వీపం సినిమాలో మాంత్రికుడుగా నటించారు. ఆ తర్వాత మరి తిరిగి చూసుకోలేదు. మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, ఢమరుకం, బ్యాంగ్ బాజా, శ్లోకం వంటి అనేక సినిమాలలో నటించారు. తెలుగు, తమిళ్, మళయాళ సినిమాలలో నటించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.