
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పైనే అయ్యింది. గత ప్రభుత్వానికి సినీ పరిశ్రమతో సత్సంబంధాలే ఉండేవి. అయినా వివిద కారణాల వలన సినీ అవార్డుల కార్యక్రమం నిర్వహించలేదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నంది అవార్డుల స్థానంలో ప్రజాకవి గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రతిపాదనపై తెలుగు సినీ పరిశ్రమ సానుకూలంగా స్పందించింది.
రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం ఇప్పటికే గద్దర్ అవార్డుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం సచివాలయంలో తన కార్యాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించారు.
సినీ పరిశ్రమలో అన్ని విభాగాలలో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించే విదంగా ఈ అవార్డులు ఉండాలని సూచించారు. నూతన దర్శకులు, నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులని కూడా ప్రోత్సహించేందుకు వీలుగా ఈ కార్యక్రమం రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
గత ప్రభుత్వం సినీ పరిశ్రమని ప్రోత్సహించడంలో అశ్రద్ద వహించిందని కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తూ సినీ పరిశ్రమని ప్రోత్సహిస్తోందన్నారు.
తెలుగు సినీ పరిశ్రమ వలన తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు వస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ రోజున హైదరాబాద్లో అట్టహాసంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిద్దామని, దానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
అల్లు అర్జున్-సంధ్య థియేటర్ ఘటనతో ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మద్య దూరం పెరిగింది. ఈ గద్దర్ అవార్డుల కార్యక్రమంతో ఆ దూరం తగ్గి మళ్ళీ సినీ పరిశ్రమకి, ప్రభుత్వానికి మద్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిద్దాం.