
డాకూ మహరాజ్ సినిమా సక్సస్ మీట్‌లో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, “ఇప్పుడు యావత్ దేశవ్యాప్తంగా ప్రజలు మన తెలుగు సినిమాలను మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్‌లో వాళ్ళు కూడా ఓ తెలుగు సినిమాలో నటించాలని, తెలుగు దర్శకులతో ఓ సినిమా చేయాలని తహతహలాడుతున్నారు. మన తెలుగు సినిమా ఇంత ఉన్నత స్థితికి చేరుకున్నందుకు మనమందరం ఎంతో గర్వపడాలి. కానీ మనమే మన తెలుగు సినిమాలని దెబ్బ తీసుకుంటున్నాము. ఎందుకు?
ఓ సినిమా వెనుక లైట్ బాయ్ మొదలు నిర్మాత వరకు ఎంతో మంది నిద్రాహారాలు మానేసి ఎంతగానో శ్రమించి సినిమాని తెరకెక్కిస్తారు. వారి కష్టాన్ని అందరూ గుర్తించాలి. గౌరవించాలి. నిర్మాతలు అప్పులు తెచ్చి మరీ సినిమాలు నిర్మిస్తుంటారు. సినీ పరిశ్రమలో అందరికీ అన్నం పెట్టేవాడే నిర్మాత. కనుక సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ నిర్మాతని గౌరవించాలి. మేమందరం అదే చేస్తుంటాము.
కానీ ఓ సినిమాకు తద్వారా ఆ నిర్మాతకు నష్టం కలిగేలా ఎవరూ కూడా ట్రోలింగ్ చేయడం సబబు కాదు. కరోనా దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమ ఇక కొలుకోలేదని అందరూ అనుకున్నారు. కానీ నేడు ఆస్కార్ అవార్డ్ సాధించే స్థాయికి ఎదిగింది.
ఇంత ఎత్తుకి ఎదిగి అందరి మెప్పు పొందుతున్న మన తెలుగు సినిమాని చూసి అందరం గర్వపడాలి. అందరం కలిసి దానిని కాపాడుకోవాలి. కానీ మన సినిమాని మనమే చంపేసుకుంటే ఎలా?కనుక తెలుగు సినిమాకి, సినీ పరిశ్రమకి, నిర్మాతలకు నష్టం కలిగేలా ఎవరూ వ్యవహరించవద్దని తమన్ విజ్ఞప్తి చేశారు.
ప్రపంచం మొత్తం తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది.
ఏం బతుకు బతుకుతున్నామో అర్థంకావట్లేదు.. మనమే మన సినిమాని చంపేస్తున్నాం - థమన్#Thaman #DaakuMaharaaj https://t.co/NgRBbK9iYS pic.twitter.com/9a40ZBb8me
తమన్ చెప్పిన ఈ మంచి మాటలపై చిరంజీవి స్పందిస్తూ ‘మ్యూజిక్ తమన్’ అంటూ ట్వీట్ చేశారు. ‘ఎప్పుడూ అందరితో సరదాగా మాట్లాడే నువ్వు నీ మనసులో ఇంత ఆవేదన దాచుకున్నావని నాకు తెలియదు. నువ్వు చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకాయి,” అంటూ ట్వీట్ చేశారు.