రాజాసాబ్! ఫౌజీ ఎప్పుడు మొదలుపెడతారు?




మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ చేస్తున్న ‘ది రాజాసాబ్’ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 21 నుంచి శంషాబాద్ సమీపంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్‌తో రాజాసాబ్ టాకీ పార్ట్ పూర్తవుతుంది. రెండు పాటలు విదేశాలలో చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. 

వాటిని పూర్తిచేస్తే ప్రభాస్‌ రాజాసాబ్ గెటప్ తీసేసి ‘ఫౌజీ’ గెటప్‌లోకి మారవచ్చు. రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కావలసి ఉంది. కానీ మరికాస్త ఆలస్యం కావచ్చని సమాచారం. కనుక రాజాసాబ్ షూటింగ్‌ పూర్తికాగానే హను రాఘవపూడి దర్శకత్వంలో మొదలుపెట్టిన ఫౌజీ సెట్స్‌లో ప్రభాస్‌ అడుగుపెట్టబోతున్నారు.

ఇప్పటికే కేరళలో ఫౌజీ ఓ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రభాస్‌ లేని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన షెడ్యూల్లో ప్రభాస్‌ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు రాజాసాబ్ పనులు పూర్తి కాగానే ప్రభాస్‌ పూర్తి సమయం ఫౌజీకి కేటాయిస్తారు. 

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌గా ఇమాన్వీ నటించబోతోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేయబోతున్నారు.  

మైత్రీ మూవీ మేకర్స్‌, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.