హరిహర వీరమల్లు మాట విన్నారా?

పవన్ కళ్యాణ్‌ కధానాయకుడుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అయినప్పటికీ, అందరికీ తెలిసిన కారణాల వలన షూటింగ్‌ చాలా ఆలస్యమైంది. ఏపీ డెప్యూటీ బాధ్యతలతో చాలా బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్‌ ఎలాగో తీరిక చేసుకొని సినిమా పూర్తిచేస్తున్నారు.

కనుక హరిహర వీరమల్లు మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించగలిగారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ పాడిన ‘మాట వినాలి గురుడా మాట వినాలి..’ అనే పాటని ఈనెల 6 న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ చేయలేకపోయారు. ఈరోజు ఆ పాట విడుదల చేశారు. 

పెంచల్ దాసు వ్రాసిన ఈ పాటని ఎంఎం కీరవాణి స్వరపరిచి సంగీతం అందించగా పవన్ కళ్యాణ్‌ స్వయంగా పాడారు. పవన్ కళ్యాణ్‌ నటుడే తప్ప గాయకుడు కాదు కనుక ఆయన పాడగలిగేవిదంగా చిన్న చిన్న పదాలతో సులువైన బాణీలో పాటని స్వరపరిచారు. మాటకు ఉండే విలువని తెలియజేస్తూ సాగింది పాట.      

క్రిష్ స్థానంలో జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా నిధీ అగర్వాల్ నటిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.