
సినిమా ప్రమోషన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజినీకాంత్ మళ్ళీ ‘టైగర్ కా హుకుం’ విడుదల చేసిన జైలర్-2 ఆఫీషియల్ అనౌన్స్మెంట్ చూసి అందరూ ‘ఆహా.. ఓహో..’ అనుకుంటుండగానే ఓ పూర్తికాని స్టోరీ చెపుతానంటూ ఆనంద్ దేవరకొండ చేయబోతున్న తదుపరి చిత్ర ప్రకటన చాలా వెరైటీగా చేశాడు.
సినిమాకి కధ, స్క్రీన్ ప్లే చాలా ముఖ్యమని ఓ పక్క దర్శకుడు హీరో చిన్నప్పుడు పాత్ర చేసిన కుర్రాడికి వివరిస్తుంటే, ఇదివరకు ఓ సందర్భంలో నిర్మాత నాగ వంశీ “సినిమాకి కధ, స్క్రీన్ ప్లే, తొక్కా తోటకూర ఎవడికి కావాలి?” అంటూ మాట్లాడిన మాటలు వినిపించడం అలరిస్తుంది.
ఓ మద్య తరగతి కుటుంబంలో భార్య, భర్త వారికో బద్దకస్తుడైన ఓ కొడుకుని పెట్టి ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ అలాంటి సినిమాయే చేస్తున్నాడు. ‘మిడిల్ క్లాస్ మెమొరీస్’ వంటి చక్కటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాతో అందరినీ అలరించిన తాను ఇప్పుడు ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ స్టోరీతో అలరిస్తానని ఆనంద్ దేవరకొండ ఈ వీడియోని ముగించాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్:32గా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించబోతున్న ఈ సినిమా షూటింగ్ మొదలైందని తెలియజేస్తూ విడుదల చేసిన ప్రమో వీడియో చాలా అలరిస్తుంది.
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ఆదిత్య హాసన్, సంగీతం: హేషం అబ్దుల్ వాహిబ్, కెమెరా: అజీమ్ మహమ్మద్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.