అల్లు అర్జున్‌కి పోలీసులు హెచ్చరిక

సంధ్య థియేటర్‌ ఘటనలో ఇప్పటికే చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న అల్లు అర్జున్‌కి పోలీసులు మరోసారి హెచ్చరించారు. ఆ ఘటనలో గాయపడి అప్పటి నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ని అల్లు అర్జున్‌ పరామర్శించాలనుకున్నారు.

ఇదే విషయం తెలియజేస్తూ అల్లు అర్జున్‌ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దానిపై వారు వెంటనే స్పందిస్తూ, శ్రీతేజ్‌ని పరామర్శించేందుకు రావద్దని సూచించారు. ఒకవేళ వస్తే మిమ్మల్ని చూసేందుకు అభిమానులు తరలివస్తారు కనుక తప్పనిసరిగా తమ సూచనల పాటించాలని లేకుంటే అక్కడ ఎటువంటి అఅవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి మీరే పూర్తి బాధ్యత వహించాలని రాంగోపాల్ పేట పోలీసులు స్పష్టం చేశారు.

ఆరోజు తాను లేదా పుష్ప-2 టీమ్‌లో ఎవరూ కూడా బాలుడిని పరామర్శించడానికి హాస్పిటల్‌కు వెళ్ళకపోవడానికి ఇదే కారణమని అల్లు అర్జున్‌ అప్పుడే చెప్పారు కూడా. కానీ అల్లు అర్జున్‌తో సహా సినీ పరిశ్రమలో ఏ ఒక్కరూ హాస్పిటల్‌కు వెళ్ళి ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోకపోవడాన్ని సిఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ పరామర్శించాలనుకుంటే రావొద్దని పోలీసులే సూచిస్తున్నారు. 

అల్లు అర్జున్‌ ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి సంతకం చేయాలని నాంపల్లి కోర్టు షరతు విధించింది. దాని ప్రకారం అల్లు అర్జున్‌ ప్రతీ వారం పోలీస్ స్టేషన్‌కు వెళితే అక్కడా అభిమానులు గుమిగూడుతారు. అక్కడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది కదా?