గేమ్ చేంజర్‌ నేను కాదు.. పవన్ కళ్యాణ్‌

శనివారం సాయంత్రం రాజమండ్రిలో గేమ్ చేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అట్టహాసంగా జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డెప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్‌ పాల్గొనడం, ఆయన ప్రసంగం రెండూ కూడా అటు సినీ పరిశ్రమకు, ఇటు గేమ్ చేంజర్‌ సినిమాకు చాలా అనుకూల వాతావరణం సృష్టించాయి. 

ఈ వేడుకలో పవన్ కళ్యాణ్‌ పాల్గొనడం ద్వారా మెగా అభిమానులు అందరినీ ఏకం చేసిన్నట్లయింది. తద్వారా వారి మద్య ఏమైనా విభేధాలు ఉన్నట్లయితే వాటిని పక్కన పెట్టి అందరూ గేమ్ చేంజర్‌ చూసేందుకు ప్రోత్సహించిన్నట్లయింది. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్‌ల గురించి పవన్ కళ్యాణ్‌ చెప్పిన మంచి మాటలు అభిమానులనే కాకుండా సామాన్య ప్రజలకు కూడా మెగా కుటుంబం పట్ల మరింత అభిమానం పెంచుతాయి. 

టికెట్స్ పెంపు గురించి పవన్ కళ్యాణ్‌ చెప్పిన మాటలు చాలా ఆలోచింపజేస్తాయి. సినీ పరిశ్రమతో కాళ్ళు మొక్కించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావించడం లేదని, సినీ పరిశ్రమ ఏపీకి తరలివస్తే స్వాగతిస్తామని పవన్ కళ్యాణ్‌ చెప్పారు. 

ఏపీలో యువతకి సినీ పరిశ్రమ పట్ల చాలా ఆసక్తి ఉందని కనుక సినీ పరిశ్రమలో దర్శకులు, సంగీత దర్శకులు, స్టంట్ మాస్టర్స్, కొరియో గ్రాఫర్స్ ఇంకా 24 విభాగాలలో నిపుణులు ఏపీలో శిక్షణా తరగతులు నిర్వహించాలని పవన్ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమకి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పవన్ కళ్యాణ్‌ చెప్పారు. 

 ఈ సందర్భంగా రామ్ చరణ్‌ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను గేమ్ చేంజర్‌ అయ్యి ఉండొచ్చు. కానీ రాజకీయాలలో గేమ్ చేంజర్‌ మాత్రం బాబాయ్ పవన్ కళ్యాణే,” అని అన్నారు.