గేమ్ చేంజర్‌కి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఈ నెల 10న భారీ అంచనాల మద్య విడుదల కాబోతున్న గేమ్ చేంజర్‌ సినిమా స్పెషల్ షో, బెనిఫిట్ షోలకి, టికెట్స్ ధర పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.

జనవరి 10వ తేదీన రాత్రి ఒంటి గంటకు రూ.600 అదనపు చార్జీలతో ప్రివిలేజ్ షో వేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఆరోజున ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో 6 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతించింది.

జనవరి 11 నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై అదనంగా రూ.135 చొప్పున, మల్టీ ప్లెక్స్ థియేటర్లలో అదనంగా రూ.175 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ప్రివిలేజ్ షోలు, అదనపు షోలు వేసుకునేందుకు, టికెట్స్ ధరలు పెంచుకునేందుకు అనుమతించబోమని సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలోనే కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పేశారు. కనుక గేమ్ చేంజర్‌ నిర్మాణ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్ధించలేదు.  

శనివారం సాయంత్రం రాజమండ్రిలో గేమ్ చేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, దర్శకులు శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుజీత్, సంగీత దర్శకుడు తమన్, రామ్ చరణ్‌, అంజలి తదితరులు రాజమండ్రి చేరుకున్నారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.