
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో సిద్దమైన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారని సమాచారం. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు.
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుపుతామని దిల్‌రాజు ప్రకటించినప్పటి నుంచి అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు. ఊరంతా రామ్ చరణ్ పోస్టర్స్, కటవుట్స్ తో నింపేశారు. ఈరోజు ఉదయం నుంచే కార్లు, బైకులు వేసుకొని వేదిక వద్దకు వచ్చి ఏర్పాట్లు ఏవిదంగా జరుగుతున్నాయో చూసి వెళుతున్నారు. సుమారు లక్ష-లక్షన్నర మంది అభిమానులు రావచ్చనే అంచనాతో పోలీసులు చాలా భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ పోలీస్ శాఖ 1,200 మంది పోలీసులు, మరో 400 మంది ఎస్సై, సీఐ స్థాయి అధికారులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. చెన్నై-కోల్‌కత్తా మద్య రాకపోకలు సాగించే వాహనాలను జాతీయ రహదారిపై వేరే మార్గాలకు మళ్ళిస్తున్నారు.