పుష్పరాజ్ దోపిడీ ఆపేదేలే.. రూ.1799 కోట్లు!

పుష్ప-2 అన్ని రికార్డులను తిరగరాస్తూ భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. సంధ్య థియేటర్‌ ఘటన, తదనంతర పరిణామాలతో అల్లు అర్జున్‌ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ పుష్ప-2 కలెక్షన్స్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు.

డిసెంబర్‌ 5న పుష్ప-2 విడుదల కాగా 28 రోజులలో రూ.1799 కోట్లు కలెక్షన్స్‌ సాధించింది. మరో వారంలో సంక్రాంతి పండుగ హడావుడి మొదలవుతోంది కనుక అది పూర్తయ్యేసరికి రూ.2,000 కోట్లు చేరుకునే అవకాశం ఉంది. 

పుష్ప-2 ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ, సంధ్య థియేటర్‌ కేసు కారణంగా ఇతర రాష్ట్రాలలో ఈ సినిమా విజయోత్సవాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానాలు వస్తున్నప్పటికీ వెళ్ళలేకపోతున్నానని అల్లు అర్జున్‌ స్వయంగా చెప్పారు. 

హైకోర్టు ఆయనకు మద్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నేడు (శుక్రవారం) నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.

అల్లు అర్జున్‌ బెయిల్‌పై హైకోర్టు అభ్యంతరం చెప్పలేదు పైగా రెగ్యులర్ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టుని ఆశ్రయించాల్సిందిగా సూచించింది కనుక నాంపల్లి కోర్టు కూడా రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసే అవకాశం ఉంది. అప్పుడు పోలీసులు ఆయన బెయిల్‌ రద్దు చేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ హైకోర్టులో పిటిషన్‌ వేసే అవకాశం ఉంది.