రాజమౌళి-మహేష్ బాబు సినిమా పూజా కార్యక్రమం షురూ

రాజమౌళి, మహేష్ బాబు సినిమాకి గురువారం హైదరాబాద్‌ నగర శివారులో అల్యూమినియం కంపెనీలో పూజా కార్యక్రమం జరుగుతోంది. మహేష్ బాబు తన సినిమా పూజా కార్యక్రమాలకు హాజరవరు. కానీ సెంటిమెంట్ పక్కనపెట్టి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొద్ది సేపటి క్రితమే రాజమౌళి, ఆయన సతీమణి రమ, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు అక్కడికి చేరుకున్నారు. 

రాజమౌళి సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి షూటింగ్‌ పూర్తయ్యేవరకు ప్రతీదీ చాలా గోప్యంగా ఉంచుతారు. కనుక ఈ పూజా కార్యక్రమాన్ని కూడా గోప్యంగానే పూర్తిచేస్తారా లేక ఫోటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేస్తారా?అనేది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. 

ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో నేడు పూజా కార్యక్రమంతో లాంఛనంగా సినిమా షూటింగ్‌ జరిగినప్పటికీ, మరో రెండు మూడు నెలల తర్వాతే రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని సమాచారం. సుమారు వెయ్యి కోట్ల భారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2027లో విడుదల చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. 

నిధుల కోసం అడవులలో సాగే సాహసయాత్ర కధతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి తండ్రి, ఈ సినిమాకు కధ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇదివరకే చెప్పారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.