
డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు పుష్ప-2 ప్రివిలేజ్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు ఆ థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. వాటిపై అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో కేసు వేసి న్యాయపోరాటం చేస్తున్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందిస్తూ, ఆరు పేజీల సుదీర్గమైన జవాబు ఇచ్చింది.
అలాగే సంధ్య థియేటర్లో వాహనాలు పార్కింగ్ చేసేందుకు తగినంత స్థలం వేరేగా ఉందని, వాహనాల కారణంగా థియేటర్‌కి ఆవరణ ఇరుకుగా మారలేదని పేర్కొంది. పుష్ప-2 ప్రివిలేజ్ షో ప్రదర్శించేందుకు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ ఆ పత్రాల కాపీలను జత చేసింది.
పుష్ప-2 సినిమా ప్రదర్శన కోసం మైత్రీ మూవీ మేకర్స్ తమ థియేటర్ని రెండు రోజులు అద్దెకు తీసుకుందని పేర్కొంది. పుష్ప-2 సినిమా ప్రదర్శన విషయంలో తాము ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదని, ఆ ఘటన జరిగిన రోజు తమ థియేటర్లో 80 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, కనుక భద్రతాపరంగా తమ స్థాయిలో తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది.
గత 45 ఏళ్ళుగా తమ థియేటర్లో సినిమాలు ప్రదర్శిస్తూనే ఉన్నామని కానీ ఏనాడూ ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరుగలేదని, కానీ పుష్ప-2 రిలీజ్ రోజున జరిగినందుకు తాము చాలా బాధపడుతున్నామని పేర్కొంది. ఇది అనూహ్యంగా జరిగిన ఘటన తప్ప ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగినది కాదని సంధ్య థియేటర్ లేఖలో పేర్కొంది.