
సంధ్య థియేటర్ ఘటన తదనంతర పరిణామాలతో ఇక్కడ అల్లు అర్జున్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఒంటరిగా మిగిలిపోతే, ఆయన నటించిన పుష్ప-2 మాత్రం యావత్ ప్రపంచాన్ని నిలువు దోపిడీ చేసేస్తోంది. నిర్మాతలకు కలెక్షన్స్ కనకవర్షం కురిపిస్తూనే ఉంది. రోజుకో కొత్త రికార్డ్ సృష్టిస్తూ దూసుకుపోతూనే ఉంది.
డిసెంబర్ 5న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా ఈ 22 రోజులలోనే రూ. 1719.50 కోట్లు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ సంవత్సరంలో కేవలం 22 రోజులలో ఇంత కలెక్షన్స్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప-2 రికార్డ్ సృష్టించింది.
మరో మూడు రోజులలో న్యూఇయర్ వేడుకలు, వెంటనే సంక్రాంతి వేడుకలు మొదలైపోతాయి. కనుక ఈ పండగ సీజన్లో పుష్ప-2 మరో రూ.300-500 కోట్లు కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యం లేదు.
పుష్ప-2కి కొనసాగింపుగా పుష్ప-3 తీస్తామని అల్లు అర్జున్, సుకుమార్ ముందే చెప్పారు. కానీ పుష్ప-1,2 సినిమా స్టోరీపై రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు, పుష్ప-2 విజయంతో పాటు ఎదురైన ఈ చేదు అనుభవాల కారణంగా పుష్ప-3 తీస్తారా లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే పుష్ప-3 షూటింగ్ మరో ఏడాది వరకు మొదలుపెట్టే అవకాశం లేదు కనుక అప్పటికి ఈ వేడి, విమర్శలు అన్నీ చల్లబడతాయి కనుక తప్పకుండా పుష్ప-3తీయడం ఖాయమే అని భావించవచ్చు.