
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల ముఖాముఖీ సమావేశం తర్వాత ప్రివిలేజ్, బెనిఫిట్ షోలకు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించబోమని చెప్పేయడంతో సంక్రాంతి పండుగకు విడుదలవుతున్న గేమ్ చేంజర్, డాకూ మహారాజ, సంక్రాంతికి వస్తున్నాం మూడు పెద్ద సినిమాలకు ముందే ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అలాగే చేయాలనుకుంటే ఇంకా నష్టపోతాయి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని పట్టించుకోకుండా బెనిఫిట్ షోలకు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించిన్నట్లయితే కొంతలో కొంత నష్టం తగ్గుతుంది.
కానీ ఒకవేళ ఏపీ ప్రభుత్వం కూడా ప్రివిలేజ్, బెనిఫిట్ షోలకు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించకపోతే, మూడు సినిమాలు తీవ్రంగా నష్టపోతాయి. సినిమాలు హిట్ అయ్యి సంక్రాంతి సీజన్లో కలెక్షన్స్ బాగానే సాధించినప్పటికీ, నెలన్నరలోగా ఓటీటీలోకి వెళ్ళిపోవాలి కనుక సంక్రాంతికి వచ్చిన కలెక్షన్స్‌తో సంతోషపడాల్సి ఉంటుంది.
కనుక సినీ ప్రముఖులు ఇప్పటి నుంచే సిఎం చంద్రబాబు నాయుడు లేదా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుకొని ఏపీ ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకుంటే మంచిది. లేదా ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం మంచిది.