
ఈరోజు సిఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల సమావేశం ముగిసిన తర్వాత, సీనియర్ నటుడు, ప్రముఖ వ్యాపారవేత్త మురళీ మోహన్ ఈ సమస్యకి మూలకారణం రెండు ముక్కల్లో చెప్పారు. “సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన మా అందరినీ ఎంతో బాధించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల ఫలితాలు ఎటువంటివో సినీ పరిశ్రమకు సినిమా రిలీజైన మొదటి రోజు అటువంటిది.
సినిమాల రిలీజ్ మద్య పోటీ విపరీతంగా ఉండటంతో, దానిని తట్టుకొని సినిమాని నిలబెట్టుకునేందుకు విస్తృతంగా ప్రమోషన్స్ చేయకతప్పడం లేదు. ఇప్పుడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నందున ప్రమోషన్స్ అవసరం మరింత పెరిగింది,” అని అన్నారు.
పుష్ప-2 సినిమా ప్రమోషన్స్ నభూతో.. నభవిష్యత్ అన్నట్లు ఏ స్థాయిలో నిర్వహించారో అందరూ చూశారు. సంధ్య థియేటర్లో అభిమానుల కోసం పుష్ప-2 ప్రివిలేజ్ షో వేస్తున్నప్పుడు, అల్లు అర్జున్ అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకోవడం ప్రమోషన్స్‌లో భాగమే అనుకోవచ్చు.
కానీ దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తర్వాత వరుసగా జరిగిన ఈ పరిణామాలన్నీ సినీ పరిశ్రమకి, పోలీసులకు, అభిమానులకు అందరికీ గుణపాఠాలు వంటివే. వాటి నుంచి నేర్చుకొని ముందుకు సాగితే మళ్ళీ ఇటువంటి ఘటనలు జరుగకుండా నివారించవచ్చు.