అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి!

అమెరికాలో సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉండిపోయిన నవీన్ పోలిశెట్టి పూర్తిగా కొలుకున్నాడు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తాను చేయబోయే సినిమాలకు కధలు సిద్దం చేసుకుంటూనే ఉన్నారు.

వాటిలో మొట్టమొదటిది ‘అనగనగా ఒక రాజు.’ సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిపి ఈ సినిమా నిర్మించబోతున్నారు. నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా ‘రాజుగారి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్’ అంటూ ఓ టీజర్‌ విడుదల చేశారు.

దానిలో అతిధులకు బంగారు కంచాలలో విందు భోజనం వడ్డించబోతున్నట్లు చూపారు. వారిని పాలకరిస్తున్న చమ్మక్‌ చంద్ర ఒకరికి వెండి కంచం పెట్టి ఉండటం గమనించి, “ఏయ్ ఎవర్రా? బంగారు పళ్లెల మద్య చీప్‌గా ఈ వెండి పళ్ళెం పెట్టింది? ఎవరి పెళ్ళి అనుకొంటున్నారా మీరు? రాజుగారి పెళ్ళి. ఏడు తరాల పెళ్ళి,” అని అంటుండగా చేతి నిండా బంగారు ఉంగరాలతో సింహాసనంలో కూర్చొన్న నవీన్ పోలిశెట్టిని వెనుక నుంచి చూపారు. డిసెంబర్‌ 26 నుంచి రాజుగారి పెళ్ళి హడావుడి మొదలవుతుందని చెప్పేశారు. 

కనుక నవీన్ పోలిశెట్టి తనకు సరిపోయే చక్కటి కధను ఎంచుకున్నారని అర్దమవుతోంది. అనగనగా ఒక రాజు గారి పెళ్ళి భోజనాల హడావుడి కూడా చాలా బాగుంది. ఇక రాజుగారి పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో చూడాలి. ఈ సినిమాలో మృణాళినీ టాకూర్ హీరోయిన్‌గా నటించబోతోంది.