ఎల్లమ్మతో వస్తున్న వేణు ఎల్దండి

హాస్యనటుడుగా కాలక్షేపం చేస్తున్న వేణు ఎల్దండి బలగం సినిమాతో మంచి సత్తా ఉన్న దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కనుక బలగం తర్వాత ఆయన తీయబోయే సినిమా కోసం ఇటు సినీ పరిశ్రమ, అటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అంత మాత్రాన్న వేణు ఎల్దండి తొందరపడి ఏదో ఓ సినిమా తీసేయాలనుకోలేదు.

తెలంగాణ నేపధ్యంతోనే మరో బలమైన కధని సిద్దం చేసుకున్నారు. ఆయన చేయబోయే తదుపరి సినిమా టైటిల్‌ ఎల్లమ్మ. ఈ సినిమాలో నితిన్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు చేయబోతున్నారు. యాక్షన్, రొమాంటిక్ సినిమాలు చేసే యువ హీరో నితిన్ గ్రామీణ నేపధ్యంతో తీయబోతున్న ఈసినిమాలో నటిస్తుండటం ఆశ్చర్యకరమే. 

ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించబోతున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభిస్తామని దిల్‌రాజు చెప్పారు. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.