పుష్ప-2: ఇక్కడ కేసులు.. అక్కడ కలెక్షన్స్‌!

అల్లు అర్జున్‌ ప్రస్తుతం చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. సంధ్య థియేటర్‌ ఘటనలో ఇక్కడ ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతుంటే, అక్కడ ఉత్తరాది రాష్ట్రాలలో పుష్ప-2 దుమ్ము దులిపేస్తోంది. 

డిసెంబర్‌ 5న ఈ సినిమా విడుదల కాగా ఈ 19 రోజులలో 704.25 కోట్లు కలెక్షన్స్‌ వసూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. 

పుష్ప-2 కలెక్షన్స్‌ చూసి బాలీవుడ్ దిగ్గజాలు సైతం నివ్వెరపోతున్నారు. దక్షిణాదికి చెందిన ఓ హీరో  అల్లు అర్జున్‌ బాలీవుడ్‌కి కంచుకోట వంటి ఉత్తరాది రాష్ట్రాలలో ప్రభంజనం సృష్టిస్తుండటంతో ఇప్పుడు బాలీవుడ్‌ కూడా తాము ఎంచుకుంటున్నకధలు, వాటితో సినిమాలు తీసే విధానం అన్నీ సమూలంగా మార్చుకోక తప్పదని గ్రహించాయి. 

ముఖ్యంగా దక్షిణాదికి చెందిన అల్లు అర్జున్‌కి, పుష్ప-2 సినిమా ట్రైలర్ బిహార్‌ రాజధాని పాట్నాలో విడుదల చేసినప్పుడు బిహారీలు జేజేలు పలకడం చూసి బహుశః బాలీవుడ్‌ ఆశ్చర్యపోయి ఉండొచ్చు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ బడ్జెట్‌తో సినిమాలు తీస్తే సరిపోదు.. అందుకు తగ్గట్లుగా ప్రమోషన్స్ కూడా చేయాలని పుష్ప-2 బాలీవుడ్‌కి నిరూపించి చూపింది. కనుక ఇకపై బాలీవుడ్‌పై పుష్ప-2 ప్రభావం చాలా ఉంటుందని చెప్పవచ్చు. 

దక్షిణాది సినిమాలు, సినీ పరిశ్రమ, నటీనటులు అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్‌ని ఓకే ఒక్క సినిమాతో ఇంతగా ప్రభావితం చేసిన అల్లు అర్జున్‌, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో దోషిగా తలదించుకోవలసి రావడం,  పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పాల్సి రావడం చాలా విచిత్రమైన పరిస్థితే కదా?