
ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సుమారు 3 గంటల సేపు పోలీస్ అధికారులు అల్లు అర్జున్‌ని సంధ్య థియేటర్ ఘటనకు సంబందించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రికార్డ్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ నేతృత్వంలో ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ అల్లు అర్జున్‌ని ప్రశ్నించారు. అనంతరం అల్లు అర్జున్ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు.
అయితే అల్లు అర్జున్ ప్రధాన బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చినప్పుడు ఆయనతో పాటు 50 మంది బౌన్సర్స్ వచ్చి థియేటర్ వద్ద చాలా హంగామా చేశారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కిందపడి ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పినా బౌన్సర్లు పట్టించుకోలేదని ఆమెను ఆస్పత్రికి తరలించడంలో సాయపడిన ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
ఈ ఘటన తర్వాత పోలీస్ అధికారులు థియేటర్లో అభిమానులతో కలిసి పుష్ప-2 చూస్తున్న అల్లు అర్జున్‌ని కలిసి ఈ విషయం చెప్పేందుకు లోనికి వెళ్ళబోతే వారిని బౌన్సర్లు అడ్డుకున్నారు. అప్పుడు ఏసీపీ రమేష్ వారిని అరెస్ట్ చేస్తామని గట్టిగా హెచ్చరించడంతో వెనక్కు తగ్గారు.
కనుక పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించినందుకు బౌన్సర్ ఆంటోనీని నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని సంధ్య థియేటర్ వద్దకు తీసుకువెళ్ళి సీన్ రిక్రియేట్ చేసి ఆ రోజు తొక్కిసలాట ఎప్పుడు ఏవిదంగా మొదలైందనే విషయాలు రాబట్టనున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ, “బౌన్సర్లకు వారిని సప్లై చేసే సంస్థలకు, వారి సేవలు పొందుతున్న సినీ ప్రముఖులకు ఇదే చివరి హెచ్చరిక. ఇకపై బౌన్సర్లు పోలీసులను తాకినా, ప్రజలతో దురుసుగా వ్యవహరించినా అందుకు బౌన్సర్లతో పాటు వారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
బౌన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూసుకోవలసిన బాధ్యత వారిని సప్లై చేసే సంస్థలు, వారి సేవలు పొందుతున్న సినీ ప్రముఖులదే. తర్వాత ఎటువంటి సాకులు చెప్పినా పట్టించుకోము. చట్ట ప్రకారం అందరిపై చర్యలు తీసుకుంటాము,” అని హెచ్చరించారు.
బౌన్సర్లను, ప్రైవేట్ బాడీ గార్డ్స్ ను, వీరిని నియమిస్తున్న ఏజెన్సీలను హెచ్చరించిన హైదరాబాద్ సీపీ @CPHydCity
— Telangana Police (@TelanganaCOPs) December 22, 2024
సామాన్యప్రజలపై దాడులు సహించబోము. బౌన్సర్ల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై, నిర్వాహకులపై కూడా అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. @CVAnandIPS #TelanganaPolice pic.twitter.com/mfor76UYii