ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఇక లేరు

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ (90) సోమవారం ఉదయం కన్ను మూశారు. గత కొన్నేళ్ళుగా కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొన్ని వారాలుగా ముంబయిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచారు. 

భారత్‌ గర్వించదగ్గ గొప్ప దర్శకుడు శ్యామ్ బెనెగల్. ఆయన మంథన్, మండి, అంకుర్ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్, ది మేకింగ్ ఆఫ్ మహాత్మా (మహాత్మా గాంధీ జీవిత చరిత్ర), ది ఫరగాటన్ హీరో (నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర), డిస్కవరీ ఆఫ్ ఇండియా (భారత్‌ ఎక్ కోజ్) సంవిధాన్ వంటి గొప్ప డాక్యుమెంటరీలతో కూడా అందరినీ మెప్పించారు.

శ్యామ్ బెనెగల్ 90 ఏళ్ళ వయసులో కూడా బంగబంధు షేక్ ముజీబుర్ ఉర్ రహమాన్ జీవిత చరిత్ర ఆధారంగా 2023లో ముజీబ్: ది మేకింగ్ ఇండియా తీశారు. దాని తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో గూడచారిగా పనిచేసిన  నూర్ ఇనయాత్ ఖాన్ జీవితకధ ఆధారంగా ఓ సినిమా తీద్దామనుకున్నారు.

ఇటీవలే 90వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయన మాట్లాడుతూ, "నా టీమ్‌ కేక్ కట్ చేస్తే ఆరోజు నా పుట్టిన రోజు అని గుర్తొస్తుంది. అంతకు మించి పుట్టినరోజుకి ఎటువంటి ప్రాధాన్యం లేదు. ప్రతీ ఒక్కరూ ఏదో ఓ రోజు చనిపోవలసిందే. ఆలోగా మనం ఏం చేశామనేదే ముఖ్యం. ప్రస్తుతం నేను మరో రెండు మూడు ప్రాజెక్టులు గురించి ఏర్పాట్లు చేసుకుంటున్నాను,” అని అన్నారు.

శ్యామ్ బెనెగల్ తరచూ డయాలసిస్ కోసం ఆస్పత్రులకు వెళ్ళి వస్తూనే 2023లో ముజీబ్: ది మేకింగ్ ఇండియా తీశారు. భగవంతుడు ఆయనకు మరికొంత కాలం ఆయుర్ధాయం ఇచ్చి ఉండి ఉంటే వాటినీ పూర్తి చేసేవారని ఆయన కుమార్తె పియా తెలిపారు.

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుంచి అంటే దాదాపు 70 ఏళ్ళుగా శ్యామ్ బెనెగల్ సినీ పరిశ్రమలో ఉన్నారు. భారతదేశం గర్వపడగల అనేక గొప్ప గొప్ప చిత్రాలు తీశారు. శ్యామ్ బెనెగల్‌కు, ఆయన సినిమాల లభించిన అవార్డుల గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద పుస్తకమే అవుతుంది.

హోమీబాబా ఫెలోషిప్, పద్మశ్రీ, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్, పద్మభూషణ్, ఏఎన్‌ర్‌ అవార్డ్, కలకత్తా యూనివర్సిటీ, గ్వాలియర్‌లోని ఐటిఎం యూనివర్సిటీల నుంచి డి.లిట్ హనోరియాస్ కాస పురస్కారాలు వాటిలో ప్రధానమైనవి.