ఓదెల2 నుంచి తమన్నా పోస్టర్

ఈరోజు మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ఆమె శివశక్తి సాధువుగా నటిస్తున్న ఓదెల-2 సినిమా అనుంచి పోస్టర్ విడుదల చేశారు. వెనుక మబ్బులు పట్టిన ఆకాశంలో గ్రద్దలు ఎగురుతుండగా ఆమె సాధు వేషధారణలో కాపాలాల గుట్టపై నడుస్తున్నట్లు పోస్టర్లో చూపారు. 

తమన్నా ఇంతవరకు గ్లామర్ పాత్రలలోనే ఎక్కువ చేసింది. హీరోయిన్ ఓరియంటడ్‌ పాత్రలు పెద్దగా చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో ప్రవేశించడంతో ఆమె వంటి సీనియర్లకు ఇప్పుడు హీరోయిన్ ఓరియంటడ్‌ సినిమాలకు షిఫ్ట్ అవుతున్నారు. 

ఓదెల-2 సినిమా విషయానికి వస్తే ఇది 2022 లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా వస్తోంది. అశోక్ తేజ దర్శకత్వంలో ఈ ఏడాది మార్చి 1న ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. ఈ సినిమాలో హర్ష పాటేల్, వశిష్ట ఎన్‌ సింహా, యువ, నాగ మహేష్, వంశీ,గగన్ విహారీ, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ: సంపత్ నంది, సంగీతం: అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: సౌందర రాజ్యం, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. ఈ సినిమాని మధూ క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ బ్యానర్లపై డి.మధు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోందని ప్రకటించారు తప్ప ఎప్పుడనేది తెలియజేయలేదు.