
ఓ రోగి వైద్యుడి సూచనల ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకొని ఆయన ఇచ్చిన మందులు వాడిన తర్వాత రోగం తగ్గుతుందని ఆశిస్తాడు. తగ్గకపోతే వైద్యుడిని నిందిస్తాడు.
అదే విదంగా వందల కోట్లు ఖర్చు చేసి ఏళ్ళ తరబడి కమల్ హాసన్ వంటి పెద్ద నటుడిని పెట్టి భారతీయుడు-2 తీసినప్పుడు అది బాగోకపోతే నెగెటివ్ రివ్యూలే వస్తాయి కదా? నెగెటివ్ రివ్యూలు వచ్చినా సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పక ఆదరించేవారు కదా?
కనుక భారతీయుడు-2 ఫ్లాప్ అవడానికి దర్శకుడు శంకరే పూర్తి భాద్యత వహించాలి. కానీ ఆ సినిమాకి ఇంతగా నెగెటివ్ రివ్యూలు వస్తాయని నేను అనుకోలేదని, గేమ్ చేంజర్, భారతీయుడు-3 సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని దర్శకుడు శంకర్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
భారతీయుడు-2 సినిమా ఫ్లాప్ అయినందునే ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ గురించి ఆందోళన చెందుతున్నారు. పైగా పుష్ప-2 రికార్డులు బద్దలు కొడుతూ గేమ్ చేంజర్‌కి సవాలు విసురుతోంది కూడా.
అయితే గేమ్ చేంజర్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుందంటూ శంకర్ చెప్పిన మాటలు వింటే అభిమానుల ఆందోళన ఇంకా పెరగడం ఖాయం.
“ఇడో పక్క కమర్షియల్ సినిమా అని దీనిలో ఓ రాజకీయ నాయకుడికి, ప్రభుత్వాధికారికి మద్య జరిగే యుద్దమే ఈ కధ అని శంకర్ చెప్పారు. అంటే కధలో కొత్తదనం ఏమీ లేదని ముందే చెప్పేశారు. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి తీసినది ఓ మామూలు కమర్షియల్ సినిమా అని శంకర్ చెప్పారన్న మాట!
అయితే గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్, డైలాగ్స్, ఫైట్స్, డాన్స్ ప్రతీదీ అదరగొట్టేశారని శంకర్ చెప్పడం ఒక్కటే అభిమానులకు ఊరటనిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ దివపాత్రాభినయం చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కావచ్చు.
ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్గా నటించగా ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేశారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి గేమ్ చేంజర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు 5 భాషల్లో విడుదల కాబోతోంది.