రాజాసాబ్ ఏప్రిల్లో రాకపోవచ్చట!

మారుతి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాజాసాబ్’ మీద చాలా భారీ అంచనాలున్నాయి. ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన తర్వాత మొదటిసారిగా ఓ సింపుల్ తెలుగు సినిమా చేస్తుండటం ఓ కారణమైతే, హర్రర్-కామెడీ జోనర్‌లో సినిమాలు తీసి మెప్పించిన మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం మరో కారణం. కనుక రాజాసాబ్ రాక కోసం అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

రాజాసాబ్ మొదట వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకులను పలకరించాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన కాస్త ఆలస్యంగా వస్తారని తాజా సమాచారం. జొన్నలగడ్డ సిద్ధూ తన ‘జాక్’ సినిమాని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. రాజాసాబ్ ఆలస్యంగా వస్తున్నట్లు తెలుసుకున్నందునే ఏప్రిల్ 10న సినిమా విడుదలకి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. రాజాసాబ్ రావడం ఆలస్యమవుతున్నట్లయితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.