
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులైన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఆయన ఆ సంస్థ కార్యాలయంలో తన ఛాంబర్లో పూజ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వానికి మద్య వారదిగా పనిచేస్తాను. సినీ పరిశ్రమలో ఉన్నాను కనుక పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తాను.
అలాగే తెలంగాణకు చెందిన నటీనటులు, రచయితలు, దర్శకులు సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు నిర్మాతగా నేను ఎప్పటి నుంచో నా వంతు కృషి చేస్తూనే ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం, ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలను కూడా నేను ప్రోత్సాహిస్తూనే ఉన్నాను. ఇకపై కూడా మరింత మందికి సాయపడుతూ మరిన్ని మంచి సినిమాలు వచ్చేందుకు నావంతు కృషి చేస్తాను.
నాకు ఈ పదవి ఇచ్చి గౌరవించినందుకు సిఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,” అని దిల్ రాజు అన్నారు.