రాబిన్ హుడ్ క్రిస్మస్‌కి రాలేడట.. చెప్పేశాడు!

వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్‌హుడ్’  ఈ నెల 20న విడుదల చేయాలనుకున్నారు. కానీ డిసెంబర్‌ 5న పుష్ప-2 విడుదలవడంతో, ఆ ప్రభావం తమ సినిమా ఓపెనింగ్స్ పై పడకూడదనే ఉద్దేశ్యంతో మరో 5 రోజులు వెనక్కు జరిపి డిసెంబర్‌ 25న క్రిస్మస్ రోజున విడుదల చేసేందుకు సిద్దమయ్యారు.

కానీ ఇప్పుడు ఆరోజున కూడా రాబిన్ హుడ్ విడుదల చేయలేమని మైత్రీ మూవీ మేకర్స్‌ నేడు సోషల్ మీడియాలో ప్రకటించింది. కొన్ని అనివార్యకారణాల వలన రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది.

జనవరి 10న రామ్ చరణ్‌-శంకర్ సినిమా గేమ్ చేంజర్‌ విడుదల అవుతున్నందున,  డిసెంబర్‌ 25న రాబిన్ హుడ్ విడుదల చేస్తే, సినిమా బాగున్నా లేకపోయినా కలెక్షన్స్‌కి కేవలం 15 రోజులే సమయం మిగులుతుంది. బహుశః అందుకే సంక్రాంతి పండుగ తర్వాత రాబిన్ హుడ్ వస్తాడేమో?

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారంటే  ఈ సినిమాపై వారు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్దం చేసుకోవచ్చు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు.