అల్లు అర్జున్‌ ఇంటికి సినీ ప్రముఖులు క్యూ

అల్లు అర్జున్‌ ఈరోజు ఉదయం చంచల్‌గూడా జైలు నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటి నుంచి సినీ ప్రముఖులు జూబ్లీహిల్స్‌ని ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే అల్లు అర్జున్‌ ఇంటి బయట అభిమానులు ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌ వారందరికీ అభివాదం చేసి మళ్ళీ కలుద్దామని చెప్పి లోనికి వెళ్ళిపోయారు. 

అల్లు అర్జున్‌ని పరామర్శించడానికి వచ్చినవారిలో చిరంజీవి శ్రీమతి సురేఖ, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, నవీన్, రవి, బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకులు కె రాఘవేంద్ర రావు, సుకుమార్, కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, సుధీర్ బాబు తదితరులున్నారు. అందరూ అల్లు అర్జున్‌ని ఆప్యాయంగా కౌగలించుకొని కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

గత 5 ఏళ్ళుగా పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్‌-సుకుమార్ కలిసి పనిచేయడంతో అల్లు అర్జున్‌ని చూడగానే సుకుమార్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అల్లు అర్జున్‌ ఆయనని ఆప్యాయంగా కౌగలించుకొని తాను ధైర్యంగానే ఉన్నానని ఊరడించడం విశేషం. 

మొత్తం మీద సినీ పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్‌ ఎటువంటి తప్పు చేయలేదని చేయని నేరానికి అరెస్ట్‌ చేయబడ్డారని చెప్పిననట్లే భావించవచ్చు.