అల్లు అర్జున్‌కి మద్యంతర బెయిల్ మంజూరు

ఈరోజు మద్యాహ్నం అరెస్ట్‌ అయిన అల్లు అర్జున్‌కి హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. మొదట ఆయన క్వాష్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపడతామని చెప్పినప్పటికీ అల్లు అర్జున్‌ న్యాయవాదుల అభ్యర్ధన మేరకు మద్యాహ్నం భోజన విరామం తర్వాత విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

“అల్లు అర్జున్‌ ప్రముఖ సినీ నటుడు అయినంత మాత్రాన్న ఇష్టం వచ్చిన్న సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం తగదు. ఆయన కూడా ఈ  సమాజంలో పౌరుడే. ఆయనకు పౌరులకు ఉండే హక్కులన్నీ ఉన్నాయి. ఆయనకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఆ సెక్షన్స్ ఆయనకు వర్తించవు. 

ఈ విషాద ఘటనపై ఆయన చాలా పద్దతిగా స్పందించారు. తక్షణమే ఆయనని జైలు నుంచి విడుదల చేసేందుకుగాను నాలుగు వారాలకు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాము. ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసుకోవచ్చు,” అని హైకోర్టు తేల్చి చెప్పింది. 

మద్యంతర బెయిల్ కోసం రూ.50,000 పూచీకత్తు చెల్లించవలసిందిగా హైకోర్టు ఆదేశించినందున అల్లు అర్జున్‌ తరపున ఆ మొత్తం చెల్లించారు.      

అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు 2 వారాలు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయనని చంచల్ గూడ జైలుకి తరలించారు. హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసినందున ఈరోజు రాత్రి 8.30- 9.00 గంటలలోపు జైలు నుంచి విడుదల కానున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు చేరుకొని అల్లు అర్జున్‌ కోసం ఎదురుచూస్తున్నారు.