
ప్రముఖ నటుడు మోహన్ బాబు టీవీ9 మీడియా సంస్థకు, దానిలో జర్నలిస్టుగా పనిచేస్తున్న రంజిత్‌కు లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తూ ఓ లేఖని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన ఇంట్లో జరిగిన గొడవల కారణంగా తాను అస్వస్థత చెంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నందున వెంటనే స్పందించలేకపోయానని, జరిగినదానికి చాలా చింతిస్తున్నానని, టీవీ9 మీడియా సంస్థకు, జర్నలిస్టు రంజిత్‌కు బేషరతుగా క్షమాపణలు చెపుతున్నానని మోహన్ బాబు ఆ లేఖలో వ్రాశారు.
తన ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు ఒకేసారి 20-30 మంది దుండగులు లోనికి జొరబడ్డారని, వారిని అడ్డుకోవాలని తాను చేసిన ప్రయత్నంలో టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ కూడా గాయపడ్డారని, ఇందుకు తాను చాలా బాధపడుతున్నానని మోహన్ బాబు ఆ లేఖలో పేర్కొన్నారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా మీడియాపై దాడి చేయలేదని, ఆ క్షణంలో ఆవేశంలో ఆవిదంగా వ్యవహరించానని వ్రాశారు. ఏది ఏమైనప్పటికీ తన వల్ల టీవీ9 మీడియా సంస్థ, జర్నలిస్టు రంజిత్, మీడియా ప్రతినిధులు కూడా బాధ పడినందున అందరికీ క్షమాపణలు తెలుపుతున్నానని మోహన్ బాబు ఆ లేఖలో వ్రాశారు.
టీవీ9 జర్నలిస్టు పిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు.
ఆయనకు అటువంటి ఆలోచన లేనప్పటికీ ఈ కేసు తీవ్రతని దృష్టిలో ఉంచుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కానీ ఆయన కుటుంబ వ్యవహారాలలో మీడియా కూడా అతిగానే ప్రవర్తించిందని సాక్షాత్ హైకోర్టు అభిప్రాయపడింది కదా? అందుకు మీడియా కూడా ఆయనకు క్షమాపణ చెపితే హుందాగా ఉంటుంది కదా?