బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్!

నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991 లో ఆదిత్య 369 విడుదలైంది. ఆరోజుల్లో టైమ్ మిషన్‌లో కూర్చొని వర్తమానం నుంచి భూతకాలంలోకి, భవిష్యత్‌లోకి ప్రయాణించే కాన్సెప్ట్ ఎవరూ ఊహించనిదే కనుక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత దనాయికి సీక్వెల్ తీయాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ నేటి వరకు కుదరనే లేదు. 

కానీ ఇప్పుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా హీరోగా సినీ పరిశ్రమలో ప్రవేశించాడు కనుక అతను హీరోగా దీనికి సీక్వెల్‌ తీయబోతున్నట్లు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు వహించబోతున్నట్లు బాలకృష్ణ సూచించారు. 

ఇప్పటికే ఈ సినిమా పనులు ప్రారంభం అయ్యాయని త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమాని 2025లోనే విడుదల చేస్తామని బాలకృష్ణ చెప్పారు. 

బాలకృష్ణ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పైగా ఇప్పుడు కల్కి వంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో వచ్చాయి. కనుక బాలకృష్ణ-మోక్షజ్ఞతో పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ సినిమాకి సంబందించి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

ప్రముఖ దర్శకుడు ప్రశాంత వర్మ సింబా సినిమాతో మోక్షజ్ఞని హీరోగా సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. సోషియో ఫాంటసీగా వస్తున్న ఆ సినిమాకి సంబందించి వివరాలు కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది.