రిషబ్‌ శెట్టి కొత్త ప్రాజెక్ట్: ఛత్రపతి శివాజీ మహారాజ్‌

కాంతార సినిమాకు ముందు కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి చాలా సినిమాలే చేశారు. కానీ కాంతారా ఆయన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచి ఊహించని స్థాయిలో పెద్ద బ్రేక్ ఇచ్చింది. కాంతారా సూపర్ హిట్ అవడంతో రిషబ్‌ శెట్టికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. దానిని నిలుపుకునేందుకు రిషబ్‌ శెట్టి తగిన కధనే తన తదుపరి సినిమాకి ఎంచుకున్నారు. అదే.. యావత్ దేశ ప్రజలు గర్వించే ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌.’ 

ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాలు, ఆయన జీవితగాధని ఎవరు ఎన్నిసార్లు సినిమాగా తీసిన దేశప్రజలు ఆదరిస్తూనే ఉంటారు. కనుక రిషబ్‌ శెట్టి జాతీయస్థాయిలో తన గుర్తింపుని ఇనుమడింపజేసుకునేందుకు సరైన కధనే ఎంచుకున్నారని భావించవచ్చు. ఈ సినిమాలో రిషబ్‌ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా నటించబోతున్నారు. ఈ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం చేయబోతున్నారు. 

ఈ సినిమాని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఛత్రపతి శివాజీ వేషధారణలో రిషబ్‌ శెట్టి పోస్టర్ నేడు విడుదల చేశారు. ఈ సినిమా 2027, జనవరి 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని ముందే ప్రకటించారు. ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.