పుష్ప కోసం మా జీవితాలలో 5 ఏళ్ళు త్యాగం చేశాం

పుష్ప-2 బుధవారం రాత్రి 9.30 గంటల తొలి షోతో హైదరాబాద్‌లో విడుదల కాబోతోంది. ఆ తర్వాత దేశమంతా వైల్డ్ ఫైరే అంటున్నారు పుష్పరాజ్, సుకుమార్. 

నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, “సుకుమార్ వంటి ఓ అద్భుతమైన దర్శకుడు మన తెలుగు సినీ పరిశ్రమకి లభించడం మన అందరి అదృష్టం. సుకుమార్ లేకపోతే నేను లేను. ఆర్యతో నాకంటూ ఓ గుర్తింపునిచ్చి ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆయన వల్లనే నేడు ఈ వేదికపై నేను, నా ఎదుట మీరందరూ ఉన్నారు. 

ఈ సినిమాలో రష్మిక నాతో 5 ఏళ్ళపాటు కలిసి చాలా ఓపికగా ప్రయాణం చేసింది. ఆమె అంకితభావానికి చాలా ముచ్చటేస్తుంది. మన తెలుగమ్మాయిలకు శ్రీలీల స్పూర్తినిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌తో నా అనుబందం ఈనాటిది కాదు గత 20 ఏళ్ళుగా అలాగే బలంగా సాగుతోంది. 

పుష్ప కోసం మేమందరం ఎంతో కష్ట పడ్డామంటే చాలా తక్కువ చేసి చెప్పుకున్నట్లవుతుంది. పుష్ప-1,2ల కోసం మేమందరం మా జీవితాలలో 5 ఏళ్ళు పూర్తిగా త్యాగం చేసి మరీ పనిచేశాము,” అంటూ అల్లు అర్జున్‌ పుష్ప కోసం పనిచేసిన తన బృందంలో ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.