కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో నటుడు శ్రీ తేజ్‌పై కేసు నమోదు

పుష్ప-2లో ఓ ముఖ్య పాత్ర చేస్తున్న నటుడు శ్రీ తేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతను తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి సోమవారం పిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్‌తో ఆమె పిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు శ్రీ తేజ్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్స్ 69,115 (2), 318(2) కింద కేసు నమోదు చేశారు. శ్రీ తేజ్‌కు నోటీస్ పంపించి పోలీస్ స్టేషన్‌కు రప్పించి విచారణ జరుపనున్నారు. 

శ్రీ తేజ్‌ పరంపర, 9 అవర్స్, బహిష్కరణ వంటి తెలుగు వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించి సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించి సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నాడు. ధమాకా, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్‌, తాజాగా పుష్ప-2లో చేస్తున్నారు. 

వెబ్ సిరీస్‌, సినిమాలలో రాణిస్తున్నందున ఇప్పుడు తన స్థాయి పెరిగిందని భావిస్తూ తనని పట్టించుకోవడం మానేశాడని ఆ యువతి పిర్యాదు చేసింది. సినిమాలలో అవకాశాలు రాకముందు తనను ఎంతగానో ప్రేమించి పెళ్ళి చేసుకుండామని చెప్పిన శ్రీ తేజ్‌ ఇప్పుడు తనతో ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదని, ఇప్పుడు తనకు మొహం చాటేస్తూ మోసం చేస్తున్నాడని ఆ యువతి పిర్యాదు చేసింది.