వర్మ ఇదేమి ఖర్మ?

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఏపీ పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్ళగా ఇంట్లో లేరని మేనేజర్, పీఏ చెప్పారు. అప్పుడు పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా ‘స్విచ్చాఫ్’ వచ్చింది. కనుక ఆయన పోలీసులకు చిక్కకుండా పరారిలో ఉన్నట్లు పరిగణించి ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. 

ఇదివరకు ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాంగోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, టీడీపీ నేత నారా లోకేష్ లను ఉద్దేశయించి సోషల్ మీడియాలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ శాసనసభ ఎన్నికలలో టీడీపీని దెబ్బ తీసేందుకు, వైసీపీ సహాయ సహకారాలతో  చంద్రబాబు నాయుడు తదితరులు కుట్రలు చేసేవారని చూపిస్తూ ‘వ్యూహం’ సినిమా తీశారు. 

ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవడంతో రాంగోపాల్ వర్మపై ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో కేసు పిర్యాదు నమోదు అయ్యింది. ఆ కేసులోనే వర్మ ఈ నెల 19న, అప్పుడు రాలేకపోవడంతో ఈ నెల 25న విచారణకు హాజరు కావలసిందిగా పోలీసులు నోటీస్ ఇచ్చారు. కానీ వర్మ రాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు నిన్న హైదరాబాద్‌ రాగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, 

ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో వర్మ పిటిషన్‌ వేశారు. కానీ హైకోర్టు ఆ కేసు విచారణని ఈ నెల 26కి వాయిదా వేయడంతో వర్మ అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు శివ, క్షణం క్షణం వంటి అద్భుతమైన సినిమాలు తీసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ జగన్‌ని చూసుకొని రెచ్చిపోయినందుకు చివరికి ఈవిదంగా పోలీసులను తప్పించుకొని తిరగాల్సి రావడం ఖర్మ కాకపోతే మరేమిటి?