కల్కి-2 షూటింగ్ 35 శాతం పూర్తి చేశాం: నిర్మాతలు

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే తదితరులు నటించిన కల్కి ఏడి 2898 సినిమా షూటింగ్ 35 శాతం పూర్తి చేస్తామని ఆ సినిమా నిర్మాతలు స్వప్న, ప్రియాంక చెప్పారు.

గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకలలో వారు పాల్గొన్నప్పుడు కల్కి-2 సినిమా గురించి విలేఖరులు ప్రశ్నించగా, “కల్కి ఏడి 2898 సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే కల్కి-2కి సంబందించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఘాట్ చేశాము.

కల్కి-2లో దాదాపు 35 శాతం షూటింగ్ పూర్తి చేశాము. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన  తర్వాత కల్కి-2 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచనేది స్పష్టత ఇస్తాము. ఓ తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణ లభించడం చూస్తే మాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది,” అని అన్నారు. 

కల్కి ఏడి 2898 సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రభాస్ గత జన్మలో కర్ణుడుగా చూపారు. కల్కి అసలు కధ అంతా రెండో భాగంలోనే ఉందని దర్శక నిర్మాతలు చెప్పగా, మొదటి భాగంలో ‘సుప్రీం యాస్కిన్’గా కొద్ది సేపు మాత్రమే కనిపించిన కమల్ హాసన్ రెండో భాగంలో కీలక పాత్రలో చాలా సేపు కనిపిస్తానని ఆయన స్వయంగా చెప్పారు.

మొదటి భాగానికి వచ్చిన అపూర్వ స్పందన, కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కల్కి-2ని మరింత భారీగా అద్భుతంగా తీయబోతున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు. కనుక కల్కి-2 సినిమా ఏవిదంగా ఉండబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ చేయవచ్చని తెలుస్తోంది. కనుక కల్కి-2 షూటింగ్ బహుశః 2025 చివరిలో లేదా 2026 లో మొదలుపెడతారేమో?