టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు అక్టోబర్ 24 న బెయిల్ మంజూరు చేయగా దానిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషనుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
జానీ మాస్టర్ తన బృందంలో ముంబైకి చెందిన సహాయ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు కావడంతో గత నెలలో అరెస్టయ్యారు. ఆయన వెంటనే హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొంది బయటకు వచ్చి మళ్ళీ యధా ప్రకారం తన సినిమా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు.కనుక ఇటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దు చేసినట్లయితే ఆయన పరిస్థితి మళ్ళీ మొదటి కొచ్చేది.
మళ్ళీ జైలుకి వెళితే దర్శక నిర్మాతలు తమ సినిమాలకు ఇకపై ఆయనను తీసుకునే ఆలోచన చేయడం మానుకోవచ్చు. అదే కనుక జరిగితే జానీ మాస్టర్ పరిస్థితి చాలా దయనీయంగా మారేది. కానీ అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఆయన బైలు రద్దు చేయడానికి నిరాకరించింది. కనుక జానీ మాస్టర్ యధాప్రకారం తన సినిమాలు చేసుకోవచ్చు.
కానీ ఆయన తలపై ఈ కేసు కత్తి లా వ్రేలాడుతూనే ఉంటుంది. కనుక ఈ కేసు నుంచి విముక్తి పొందేవరకు ఆయన సినీ పరిశ్రమలో వెనుకబడే అవకాశాలున్నాయి.