
బాలీవుడ్ సంగీత దర్శకుడు జస్లీన్ రాయల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రాధికా మదన్ జంటగా ‘సాహిబా’ అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. దాని ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందనల ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నించగా, “అవును నేను నా సహనటితో ప్రేమలో ఉన్నాను. నాకు 35 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నేను ఒంటరిగా ఉంటానని ఎలా అనుకున్నారు? నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. కనుక మేమిద్దరం డేటింగ్ కూడా చేశాము. నాకు షరతులు లేని ప్రేమ కావాలి. నాకు ప్రేమించడం తెలుసు. ప్రేమని పొందడం కూడా తెలుసు,” అని విజయ్ దేవరకొండ చెప్పారు.
ప్రేమ గురించి మాట్లాడుతూ,” ప్రేమించడం అనేది తప్పేమీ కాదు. అయితే దానిని అర్దం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. 20 ఏళ్ళ వయసులో కంటే 30 ఏళ్ళ వయసులో ప్రేమని పూర్తిగా అర్దం చేసుకోగల మెచ్యూరిటీ వస్తుంది. కనుక అబ్బాయిలకు నా సలహా ఏమిటంటే ప్రేమ కోసం తొందరపడొద్దు. ముందుగా మీ కెరీర్‌పై దృష్టి పెట్టి నిలద్రొక్కుకోండి. ఆలోగా ప్రేమ దానంతట అదే మీ దగ్గరకు వస్తుంది,” అని విజయ్ దేవరకొండ మంచి సలహా కూడా ఇచ్చారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ ఆమె విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళి అతని కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ జరుపుకుంది కూడా. ప్రస్తుతం ఆమె పుష్ప-2ని ముగించింది. విజయ్ దేవరకొండ రెండు కొత్త సినిమాలు మొదలుపెట్టబోతున్నారు. కనుక త్వరలో వారు పెళ్ళి వార్త వినిపిస్తారేమో?