మైసూర్‌లో రామ్ చరణ్‌, బుచ్చిబాబు రెడీ

రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్‌తో మైసూరులో మొదటి షెడ్యూల్ షూటింగ్‌ ప్రారంభమవుతోంది. దీనికోసం రామ్ చరణ్‌ ఈరోజు ఉదయమే మైసూర్ చేసుకున్నారు. అంతకు ముందే దర్శకుడు బుచ్చిబాబు మైసూర్ చేరుకొని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆలయం ఎదురుగా చేతిలో సినిమా బౌండ్ స్క్రిప్ట్ పట్టుకొని ఫోటో దిగి, అమ్మవారి ఆశీర్వాదంతో సినిమా మొదలుపెట్టబోతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆయనకు స్వాగతం అంటూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. మొదటి షెడ్యూల్ కొద్ది రోజులే ఉంటుంది. దీనిలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ల మీద కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. కనుక జాన్వీ కపూర్‌ కూడా నేడు మైసూర్ చేరుకుంటారు. 

ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‌ ఇప్పటికే మూడు పాటలు పూర్తి చేశారు. మిగిలిన రెండు పాటలు కూడా త్వరలో పూర్తి చేసి అందించబోతున్నారు. ఈ సినిమాకి కెమెరా: రత్నవేలు, ఆర్ట్: కొల్ల అవినాష్ చేస్తున్నారు. ఈ సినిమాలో మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.  వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లపై కిలారు సతీష్ నిర్మిస్తున్నారు.