
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో ఒక్కొక్క పాత్రని పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో చాలా మంది అగ్రనటీనటులతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కన్నప్పలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్ నటి నుపూర్ సనన్ నటిస్తోంది. శివపార్వతులుగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వారిద్దరూ హైదరాబాద్ వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాలో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటిస్తున్నారు. చిత్ర బృందం ఆయన పోస్టర్ విడుదల చేసింది. నుదుట విభూది రేఖలతో మోహన్ బాబు మొహం పాక్షికంగా మాత్రమే చూపారు. పూర్తి పోస్టర్ శుక్రవారం విడుదల చేస్తామని దానిలో పేర్కొన్నారు.
కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.