డిసెంబర్‌లో కీర్తి సురేష్‌ పెళ్ళి?

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళీ నటి కీర్తి సురేష్‌కి డిసెంబర్‌ 12వ తేదీన పెళ్ళి జరుగబోతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్న ఆంటోనీ తట్టిల్‌తో ఆమె చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వారిరువురూ పెద్దల అంగీకారంతో ఈ నెల 12న కేరళలో కొచ్చిలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు సమాచారం.

గతంలో కూడా కీర్తి సురేష్ వేరెవరితో పెళ్ళి జరుగబోతోందని ఊహాగానాలు వినిపించినప్పుడు ఆమె వెంటనే ఖండించారు. కానీ ఈసారి ఖండించడం లేదు. కనుక వారి వివాహం ఖాయమనే భావించవచ్చు. 

కీర్తి సురేష్ 2018లో మహానటి సినిమా తర్వాత చేసిన సినిమాలలో నానితో చేసిన ‘దసరా’కు మళ్ళీ అంత మంచి పేరు పొందింది. ప్రభాస్‌ కల్కి ఎడి2898లో ‘బుజ్జి’కి కీర్తి వాయిస్ ఓవర్‌తో ప్రేక్షకులకు వినిపించారు.

ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నారు. వాటిలో రెండు పూర్తి చేయగా మరొక సినిమా షూటింగ్‌ నడుస్తోంది. పెళ్ళి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పి భర్తతో కలిసి దుబాయ్ వెళ్ళిపోతారని సమాచారం.