ఇప్పుడు ఆ విషయం మాట్లాడదలచుకోలేదు: జానీ మాస్టర్‌

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా సోమవారం ప్రజల ముందుకు వచ్చారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘కేశవచంద్ర రమావత్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని మాట్లాడుతూ, “ఇప్పుడు ఆ విషయం మాట్లాడే సందర్భం కాదు. కానీ త్వరలోనే నిజం బయటపడుతుందని చెప్పగలను. ఈ కష్టకాలంలో నాపై నమ్మకం ఉంచి నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,” అని అన్నారు.  

జానీ మాస్టర్‌, తనపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయన బృందంలో ముంబైకి చెందిన సహాయ మహిళా కొరియోగ్రాఫర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు  ఆయనని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌పై జైలుకి పంపించారు.

అదే సమయంలో ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డుకి ఎంపికవడం, ఈ నేరారోపణలతో ఆయన జైలులో ఉండటంతో ఆ అవార్డు చేజారిపోయింది. బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్‌ని తెలుగు సినీ పరిశ్రమ మళ్ళీ ఆదరిస్తుందా లేదా? అనుకుంటే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో జానీ మాస్టర్‌ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు.       

విభూది క్రియెషన్స్ బ్యానర్‌పై అచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో నిర్మించిన ‘కేశవచంద్ర రమావత్’ (కెసీఆర్)లో రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం:, కెమెరా: అంజి,  కధ, స్క్రీన్ ప్లే: రాకింగ్ రాకేష్, డైలాగ్స్: రాజ్‌ కుమార్‌ కుసుమ, సంగీతం: చరణ్ అర్జున్, ఆర్ట్: మహేష్‌ బాబు బల్లంత్, ఎడిటింగ్: మధు చేశారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది.