
ఆదివారం సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పాట్నాలో అల్లు అర్జున్ పుష్ప-2 ట్రైలర్ విడుదల చేశారు. లక్షమందికి పైగా ఈ కార్యక్రమం చూసేందుకు తరలివచ్చారంటే పాట్నాలో పుష్ప-2 క్రేజ్ ఎంతుందో అర్దం చేసుకోవచ్చు.
పుష్ప-2 ట్రైలర్ ఊహించిన దానికంటే గొప్పగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రైలర్ విడుదల చేస్తున్న కారణంగా ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా పుష్ప-2పై అంచనాలు పెంచేలా చాలా గొప్పగా ఉన్నాయి. అల్లు అర్జున్ ఎప్పటిలాగే తగ్గేదేలే అంటూ యాక్షన్ సన్నివేశాలలో విజృభించేశారు. పుష్ప మొదటి భాగంలో ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్’ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ ఈసారి మార్చి “పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా... ఇంటర్నేషనల్! అంటూ పుష్ప-2 స్థాయి ఏంటో చెప్పేశారు.
పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.