హోంబలే ఫిల్మ్స్ సంస్థ వరుసపెట్టి పెద్ద సినిమాలు నిర్మించడమే కాకుండా అది తీసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతోంది. హోంబలే ఫిల్మ్స్ విజయ జాబితాలో కేజీఎఫ్, కాంతార, సలార్ మూడు సూపర్ హిట్ సినిమాలున్నాయి. ప్రభాస్ హీరోగా 2026,2027,2028లో వరుసగా మూడు సినిమాలు తీయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది.
తాజాగా ‘మహావతార్: నరసింహ’ అనే సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు సాయంత్రం విడుదల చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తమ సొంత బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మించబోతున్న ఈ సినిమాకి శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమాకి సంగీత దర్శకత్వం సామ్ సీఎస్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని హోంబలే ఫిల్మ్స్ తెలిపింది.
శ్రీమహావిష్ణువు దశావతారాలలో నరసింహావతారం కూడా ఒకటి. దాని చుట్టూ ఈ మహావతార్ కధని అల్లుకున్నట్లు మోషన్ పోస్టర్ తెలియజేస్తోంది. కనుక మిగిలిన 9 అవతారాలతో కూడా మహావతార్ సిరీస్ సినిమాలు తీసే అవకాశం ఉన్నట్లు భావించవచ్చు.
ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కాంతార: చాప్టర్ 1 తీస్తోంది. ప్రభాస్ హీరోగా సలార్: శౌర్యాంగ పర్వం’ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఆ రెండు పూర్తికాక ముందే ఇప్పుడు‘మహావతార్: నరసింహ’ పాన్ ఇండియా మూవీ నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.