
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలలో సుమారు మూడేళ్ళ క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎట్టకేలకు ముగియబోతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఈ సినిమాతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి.
ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీరాజ్ మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేస్తున్నారు. ఆయన చేయవలసిన సన్నివేశాలన్నీ మరో షెడ్యూల్‌తో పూర్తవుతాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నందున, ఆలోగా ఆయన లేని మిగిలిన సన్నివేశాలను దర్శకుడు జ్యోతికృష్ణ హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. ఏపీ శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ వచ్చి హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొంటారు. దాంతో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ సినిమా 2025, మార్చి 28న విడుదల కాబోతోంది.
ఈ సినిమాని మొదట క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు కానీ సినిమా షూటింగ్ చాలా కాలం వాయిదా పడటంతో ఆయనకు బదులు జ్యోతీకృష్ణ మిగిలిన భాగాన్ని పూర్తిచేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్ టాలీవుడ్ నుంచి ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.