అయితే ఏటంటావ్... మీ ఊళ్ళో ఈ బొమ్మని ఆడించాల!

సత్యదేవ్, డాలీ ధనుంజయ్ కధానాయకులుగా ‘జీబ్రా’ సినిమా ఈ నెల 22న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రారంభంలో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సూపర్ హిట్ అయ్యింది. నేటి వరకు విడుదలైన అనేక చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయారు.. థియేటర్లకు రారనే వాదన తప్పని ప్రేక్షకులు నిరూపించారు.

సినిమా కంటెంట్ బాగుంటే అది చిన్న సినిమానా లేదా పెద్ద సినిమానా అని పట్టించుకోకుండా ఆదరిస్తారని స్పష్టమవుతోంది. కనుక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం మా అందరి బాధ్యత. చిన్న సినిమాలకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. చిన్న సినిమాలు కూడా ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. అప్పుడే ఇండస్ట్రీ సినిమాలతో కళకళలాడుతుంటుందని భావిస్తున్నాను,” అని చిరంజీవి అన్నారు. 

చిరంజీవి ప్రసంగిస్తున్నప్పుడు ఓ అభిమాని “బాసూ మిమ్మల్ని చూసేందుకే నేను వైజాగ్ నుంచి వచ్చాను,” అంటూ చెప్పడంతో, చిరంజీవి తన ప్రసంగాన్ని ఆపి “ఉత్తరాంధ్రా యాసలో, “అయితే ఏటంటావ్....ఇప్పుడూ? అదికాదురా నన్ను సూసేందుకు వైజాగ్‌ నుంచి వచ్చావ్ సంతోషమే... మరి ఈ బొమ్మని వైజాగ్‌లో ఆడించాలి... ఆ... అద్గదీ...”అంటూ జవాబు చెప్పేసరికి అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయి ఈలలు వేసి, చప్పట్లు చరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.