క్రిష్ జాగర్లమూడి ఓ ఇంటివాడయ్యారు

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఓ ఇంటి వాడయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో డాక్టర్ ప్రీతి చల్లా, క్రిష్ వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా క్రిష్, ప్రీతి వివాహం జరిగింది. డాక్టర్ ప్రీతి హైదరాబాద్‌లో గైనాకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. వారి వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరూ నూతన దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. 

‘గమ్యం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన క్రిష్ మొదటి సినిమాతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వేదం, కంచె, కొండ పొలం వంటి విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.

పవన్‌ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేశారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో బిజీ అయిపోయి ఆ సినిమా షూటింగ్‌ వాయిదా పడటంతో ఆ బాధ్యత దర్శకుడు జ్యోతికృష్ణకు అప్పగించి, ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో ‘ఘాటి’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాలో అనుష్క పోస్టర్‌ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంది.