జనక అయితే గనక... ఆహాలో

సుహాస్‌, సంగీర్తన విపిన్ ప్రధాన పాత్రలలో ఈ నెల 12న వచ్చిన ‘జనక అయితే గనక’ సినిమా పేరుకి తగ్గట్లే మంచి హాస్య భరితంగానే ఉన్నప్పటికీ మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌, గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, మురళీశర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమా నెలరోజులు కూడా కాక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. నవంబర్‌ 8నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా ప్రసారం కాబోతోంది. ఆహా గోల్డ్ ఖాతాదారులకు ఒక రోజు ముందుగానే ఈ సినిమా చూడవచ్చు. 

కధ ఏమిటంటే, మద్యతరగతికి చెందిన ప్రసాద్‌ (సుహాస్‌) చిన్న ఉద్యోగం. పెద్ద కుటుంబం. కనుక పిల్లలని కంటే వారి చదువులు, ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదని పిల్లలు కనకాకుండా జాగ్రత్తపడుతుంటాడు. కానీ ప్రసాద్‌ భార్య గర్భవతి (సంగీర్తన విపిన్) అవుతుంది. భార్య, తల్లి తండ్రులతో సహా అందరూ సంతోషిస్తుంటే, ప్రసాద్‌ మాత్రం బాధపడుతాడు.

తాను వినియోగించిన కండోమ్ నాణ్యమైనది కాకపోవడం వలననే తన భార్య గర్భవతి అయ్యిందని కోర్టులో కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కధ. మద్యతరగతి కష్టాలు, చిన్నచిన్న సంతోషాలు, కోరికలు, ఆశలు వగైరాలన్నీ దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల బాగానే తెరకెక్కించారు. కోర్టు విచారణలో హాస్యం బాగానే పండించగలిగారు. అయినా సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది.